Share News

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఓపెనర్..సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు

ABN , Publish Date - Feb 10 , 2024 | 08:59 AM

అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సాంక డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 20 ఫోర్లు, 8 సిక్సర్లతో 139 బంతుల్లోనే 210 పరుగులు బాదేశాడు.

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఓపెనర్..సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు

పల్లెకెలె: అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సాంక డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 20 ఫోర్లు, 8 సిక్సర్లతో 139 బంతుల్లోనే 210 పరుగులు బాదేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో శ్రీలంక తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 13వ బ్యాటర్‌గా నిలిచాడు. వన్డేల్లో శ్రీలంక తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 189 పరుగులు చేసిన జయసూర్య రికార్డును అధిగమించాడు. 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కు అందుకున్న నిస్సాంక వేగంగా ఈ మార్కు అందుకున్న మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డులను నిస్కాంక అధిగమించాడు. క్రిస్ గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. వీరేంద్ర సెహ్వాగ్ 140 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.


126 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా.. 128 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెయిన్ మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే నిస్సాంక డబుల్ సెంచరీతో శ్రీలంక జట్టు 381 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య చేధనలో అప్ఘానిస్థాన్ జట్టు 339 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన అప్ఘానిస్థాన్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (149 నాటౌట్‌), మహ్మద్‌ నబీ (136) ఆదుకున్నారు. సెంచరీలతో చెలరేగిన వీరిద్దరు ఆరో వికెట్‌కు ఏకంగా 242 పరుగులు జోడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 10 , 2024 | 08:59 AM