Phone Tapping Case: వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరవుతా..
ABN , Publish Date - Jul 11 , 2024 | 03:59 AM
‘‘నేను ఇప్పట్లో భారత్‌కు రాలేను. వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వగలను’’ అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.
ఆరోగ్యం కుదుటపడే వరకు
నేను స్వదేశానికి రాలేను
బీపీ, గుండె సమస్యలు పెరిగాయి
వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నా
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న
అధికారులకు ఈ-మెయిల్
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఇప్పట్లో భారత్‌కు రాలేను. వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వగలను’’ అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపారు. క్యాన్సర్‌కు తాను చికిత్స తీసుకుంటున్నందున.. ఆరోగ్యం కుదుట పడేవరకు అమెరికా వదిలి వెళ్లొద్దని వైద్యులు సూచించారని ఆయన వివరించారు. ‘‘కేసులో నా ప్రమేయంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. బీపీ, గుండె సమస్యలు పెరిగాయి’’ అని ఆయన దర్యాప్తు అధికారులకు పంపిన ఈ-మెయిల్‌లో వెల్లడించారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే..! పదుల సంఖ్యలో పోలీసు సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులను విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.
ఇటీవలే పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ఇల్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావు తిరిగి ఎప్పుడు వస్తారంటూ దర్యాప్తు అధికారులు ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభాకర్‌రావు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. ‘‘నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నేను జూన్ 26న భారత్‌కు తిరిగి రావాల్సింది. కానీ, అనారోగ్య కారణాలతో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాను. సమయం ప్రకారం చికిత్స తీసుకోకుంటే.. సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం కుదుట పడేదాకా అమెరికా వదిలి వెళ్లొద్దని వైద్యులు సూచించారు’’ అని ప్రభాకర్‌రావు ఈ-మెయిల్‌లో వెల్లడించారు. కాగా.. ఈ కేసు నమోదైన తొలినాళ్లలో.. మార్చి 22, 23 తేదీల్లో కూడా ప్రభాకర్‌రావు హైదరాబాద్ పోలీసులతో వాట్సాప్ కాల్‌లో మాట్లాడారు.
ఆ సమయంలో కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎస్‌ఐబీ చీఫ్‌గా తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరినీ తప్పు చేయమని ఆదేశించలేదని పేర్కొన్నారు. తన ఆరోగ్యం కుదటపడగానే హైదరాబాద్‌కు వచ్చి, దర్యాప్తు అధికారులకు సహకరిస్తానని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆరోగ్య కారణాల రీత్యా వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్‌లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. దీంతో.. తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై దర్యాప్తు అధికారులు సమాలోచన చేస్తున్నారు. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాక.. ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.