Share News

BVR Mohan Reddy: వినూత్న ఆలోచనలతోనే ఆవిష్కరణలు

ABN , Publish Date - Aug 04 , 2024 | 04:28 AM

వినూత్న ఆలోచనలతోనే అద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయని సైయంట్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని అనంతసాగర్‌లో ఉన్న ఎస్సార్‌ యూనివర్సిటీ క్యాంప్‌సలో శనివారం ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి.

BVR Mohan Reddy: వినూత్న ఆలోచనలతోనే ఆవిష్కరణలు

  • సైయంట్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి

  • తనికెళ్ల భరణికి ఎస్సార్‌యూ గౌరవ డాక్టరేటు

  • ఘనంగా ఎస్సార్‌యూ ద్వితీయ స్నాతకోత్సవం

వరంగల్‌ ఎడ్యుకేషన్‌, ఆగస్టు 3: వినూత్న ఆలోచనలతోనే అద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయని సైయంట్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని అనంతసాగర్‌లో ఉన్న ఎస్సార్‌ యూనివర్సిటీ క్యాంప్‌సలో శనివారం ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా బీవీఆర్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను జోడిస్తూ ఆవిష్కరణలు చేయాల్సిన బాధ్యత భావి ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రస్తుతం ‘టెకేడ్‌’ నడుస్తోందని, సృజనాత్మక ఆవిష్కరణలతో ఉద్యోగాలు సాధించడమే కాదు సొంతంగా సంస్థలు కూడా నెలకొల్పవచ్చన్నారు. థామస్‌ అల్వా ఎడిసన్‌, అబ్దుల్‌ కలాం లాంటి మహనీయులు వినూత్న ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు చేశారన్నారు.


వారి స్ఫూర్తితో తాను 1992లో నలుగురు ఇంజనీర్లతో సైయంట్‌ టెక్నాలజీస్‌ ప్రారంభించానని, అదే ఇప్పుడు 21 దేశాల్లో 18వేల మంది ఇంజనీర్లతో సేవలు అందిస్తోందని, రూ.700 కోట్ల టర్నోవర్‌కు ఎదిగిందన్నారు. మైక్రోసాఫ్ట్‌ లాంటి దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సైయంట్‌ సేవలు అందిస్తోందన్నారు. వైస్‌చాన్స్‌లర్‌ దీపక్‌ గార్గ్‌ మాట్లాడుతూ ఎస్సార్‌ విద్యాసంస్థల ఎదుగుదలను వివరించారు. అనంతరం సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్‌ అందించారు.


చాన్స్‌లర్‌ వరదారెడ్డి మాట్లాడుతూ 2002లో స్థాపించిన ఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎన్నో మైలురాళ్లు దాటి వర్సిటీ స్థాయికి చేరిందన్నారు. కాగా, విద్యార్థులు కష్టపడితేనే బంగారు భవిష్యత్తును అనుభవిస్తారని తనికెళ్ల భరణి అన్నారు. తనకు ఇదే మొదటి డాక్టరేట్‌ అని, తన జీవిత భాగస్వామి భవానికి ఈ డాక్టరేట్‌ను అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పట్టభద్రులైన, వివిధ కోర్సుల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు, పీహెచ్‌డీ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ప్రొ-చాన్స్‌లర్‌ ఎ.మధుకర్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ అర్చనారెడ్డి, ఫ్యాకల్టీ డీన్‌ వి.మహేష్‌, ఇంజనీరింగ్‌ డీన్‌ రామ్‌దేశ్‌ముఖ్‌, మేనేజ్‌మెంట్‌ డీన్‌ సుమన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 04:28 AM