Share News

Kaleshwaram Project: కాళేశ్వరం పత్రాలు దాచేస్తున్నారా?

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:18 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు అధికారులు సహకరించడం లేదా? కీలక పత్రాలను దాచేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాళేశ్వరం పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అక్కడే కట్టాలని సిఫారసులు ఏమైనా ఉన్నాయా?

Kaleshwaram Project: కాళేశ్వరం పత్రాలు దాచేస్తున్నారా?

  • ముందుకు సాగని కమిషన్‌ విచారణ

  • అధికారుల తీరుపై అనుమానాలు

  • ప్రతి దస్త్రాన్ని తన ముందు ఉంచాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశం

  • పంపు హౌస్‌ల నిర్మాణంలో పాల్గొన్నఅధికారుల విచారణ రేపు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు అధికారులు సహకరించడం లేదా? కీలక పత్రాలను దాచేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాళేశ్వరం పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అక్కడే కట్టాలని సిఫారసులు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ పత్రాలను తన ముందు ఉంచాలని విచారణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆదేశించినా.. నెల రోజులుగా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీంతో శనివారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రత్యేకంగా పిలిపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ముడిపడి ఉన్న ప్రతీ దస్త్రాన్ని రెండు వారాల్లోగా తన కార్యాలయంలో అందించాలని దిశానిర్దేశం చేశారు.


కాగా, 2015 మార్చిలో కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి రీ డిజైన్‌ చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టినట్లు గత ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ, 2014 జూలై 22నే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కీలక నేత విధాన నిర్ణయం తీసుకున్నారని కొన్ని పత్రాల ద్వారా తేలింది. అదే రోజున ప్రాణహిత-చేవెళ్లతోపాటు కంతనపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వం హైపవర్‌ కమిటీ వేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎంత ఎత్తుతో కట్టాలి? ఏ విధంగా కట్టాలనే అంశంపై ఈ కమిటీనే 2016 అక్టోబరు 22న సిఫారసు చేసింది. కానీ, ఈ పత్రాలేమీ కమిషన్‌ వద్ద లేకపోవడం గమనార్హం. ఏ సిఫారసుల ఆధారంగా బ్యారేజీలు కట్టారని కమిషన్‌ పదే పదే ప్రశ్నిస్తున్నా.. అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. తాజాగా జస్టిస్‌ ఘోష్‌ ఆదేశాలతోనైనా ఈ పత్రాలన్నీ ఇస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.


పంపుహౌ్‌సల నిర్మాణంపైనా విచారణ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌ్‌సల నిర్మాణంలో భాగస్వాములైన అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) నుంచి చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) దాకా అన్ని స్థాయిల అధికారులకు కమిషన్‌ కబురు పంపింది. సోమవారం (8వ తేదీన) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బ్యారేజీలతో పాటు పంప్‌హౌ్‌సలపైనా విచారణ చేపట్టాలన్న పలువురి ఫిర్యాదు మేరకు కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే, నిపుణుల కమిటీతో శనివారం సమావేశమైన జస్టిస్‌ పీసీ ఘోష్‌.. త్వరితగతిన నివేదిక అందించాలని సూచించారు. మరోవైపు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కోరారు.


విచారణకు ఈ నివేదికే కీలకమని, సత్వరమే అందించాలని నిర్దేశించారు. దాంతో పాటు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికను తెప్పించుకోవాలని సూచించారు. అఫిడవిట్లలో అందించిన పరస్పర విరుద్ధ సమాచారం ఇచ్చిన వారిని పిలిపించి, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాలని కమిషన్‌ నిర్దేశించింది. బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటో తెలుసుకోవాలని ఒక అధికారిని పుణెలోని కేంద్ర విద్యుత్‌, నీటి పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)కు కమిషన్‌ పంపించింది.

Updated Date - Jul 07 , 2024 | 03:18 AM