Kishan Reddy: నామమాత్రంగా మాఫీ..
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:49 AM
ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు.
నిబంధనల వల్ల 70ు మందికి అందలేదు
రాష్ట్ర ప్రభుత్వం.. శ్వేతపత్రం విడుదల చేయాలి
రుణమాఫీ కాని వారు వివరాలు తెలియజేయండి
మీ తరఫున పోరాడతాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ సెంటర్
హైదరాబాద్, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు. పలు నిబంధనలతో 70శాతం మంది రైతులకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని బుధవారం కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుణమాఫీ జాబితాలో లేని రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కారణంగా నష్టపోతున్న అన్నదాతలు 88861 00097 నంబర్‌కు ఫోన్ చేసి తమ వివరాలు అందజేయాలని కిషన్‌రెడ్డి కోరారు.
రైతు భరోసాతోపాటు పంటలకు రూ.500 బోనస్ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గ్రామాల్లో రచ్చబండ నిర్వహించాలని పిలుపునిచ్చారు. తమకు రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలంటూ సీఎం రేవంత్‌కు రైతులు లేఖ లు రాయాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. వారికి న్యాయం జరిగేలా పార్టీ పోరాడుతుందని కిషన్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా వేలాది మంది రైతులను బ్యాంకులు డీఫాల్టర్ల జాబితాలో చేర్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.
కానీ, ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ధరణితో నష్టపోయిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెప్పారు. మాటలు కోటలు దాటాయి కానీ.. చేతలు మాత్రం సెక్రటేరియట్ దాటడం లేదు’’ అని ఆరోపించారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, పీఆర్‌సీ, ఏమైంది? బెల్ట్‌షాపులు ఎందుకు రద్దు చేయడం లేదు? జాబ్ క్యాలెండర్ ఏది? అని సీఎం రేవంత్‌ను నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత బడ్జెట్ కంటే రూ.10వేల కోట్లు తగ్గించారని, విద్యా రంగానికి 7.60శాతం నిధులే కేటాయించారని విమర్శించారు. కాగా, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ విమర్శించారు.
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు లోక్‌సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. లోక్‌సభలో బుధవారం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51శాతమని, కేంద్రం వాటా 49 శాతమని తెలిపారు. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని ప్రశ్నించారు.