Share News

Minister Uttam Kumar: తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్: మంత్రి ఉత్తమ్..

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:47 AM

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రదేశాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఆయన సందర్శించారు.

Minister Uttam Kumar: తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్: మంత్రి ఉత్తమ్..
Irrigation Minister Uttam Kumar Reddy

సూర్యాపేట: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జలాశయాలకు భారీ ఎత్తున వరదనీరు చేరుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వరదల్లో చిక్కుకుని 10మంది ప్రాణాలు వదిలారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సైతం వరస సమీక్షలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రాణ, ఆస్తి నష్టం నివారించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.


ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రదేశాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. పంట నీట మునిగిన రైతులు ఎవ్వరూ ఆందోళనకు గురికావొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.." భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దురదృష్టవశాత్తూ కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లోనే అతి భారీ వర్షాలు పడ్డాయి. వర్షాలకు కోదాడ ప్రాంతంలో ఇద్దరు మృతిచెందడం బాధాకరం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోవడం వల్ల 300ఎకరాల్లో పంట నీట మునిగి నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రితో చర్చించి నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం. ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారం రోజుల్లో గండి పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతోంది: ఎమ్మెల్యే కేటీఆర్..

Dams: భారీ వరదలకు తెలంగాణ ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..

Rain Effect: పెద్దపల్లిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..

CM Revanth Reddy: అధికారులతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి..

Updated Date - Sep 02 , 2024 | 11:47 AM