Share News

State assembly: 24 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:00 AM

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

 State assembly: 24 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

  • అసెంబ్లీ స్పీకర్‌ అధ్యక్షతన భేటీలో నిర్ణయం

  • వారం రోజుల పాటు కొనసాగే అవకాశం

  • ఈ నెల 25 లేదా 26న పూర్తిస్థాయి బడ్జెట్‌!

  • 31లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి

  • ‘రైతు భరోసా’ పథకంపై శాసనసభలో చర్చ

  • రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపైనా!

  • ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టే చాన్స్‌

హైదరాబాద్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ మేరకు సమావేశాల ప్రారంభ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. బడ్జెట్‌ సమావేశాలను ఈ నెలలోపే పూర్తి చేసి, రాష్ట్ర వ్యయాలకు సభ అనుమతి పొందాల్సి ఉన్నందున.. గురువారం శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండ ప్రకాష్‌, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, రామచంద్రనాయక్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 10న ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ను తీసుకొచ్చింది.


2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.2,75,891 కోట్లతో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, శాసన సభ అనుమతి పొందింది. ఇందులో నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై కోసం రూ.78,911 కోట్ల వ్యయానికి సభ ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 1 నుంచి మళ్లీ వ్యయాలకు చిక్కు వచ్చి పడుతుంది. ఈ దృష్ట్యా పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంది. అందుకే ఈ నెల 24 నుంచి సమావేశాలను ప్రారంభించాలని స్పీకర్‌ అధ్యక్షతన భేటీలో నిర్ణయించారు. కేంద్రం 23న లోక్‌సభలో 2024-25కు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అందులో గ్రాంట్లు, పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎ్‌సఎస్‌) కింద వచ్చే నిధులను రాష్ట్రం పరిశీలిస్తుంది. వాటి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌కు తుది రూపునిచ్చి అసెంబ్లీలో పెట్టనుంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం పొందాలి. ఈ నేపథ్యంలో సమావేశాలను 24న ప్రారంభించి 28న ఆదివారం మినహా 31వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ పొడిగించాలనుకుంటే.. ఈ నెల 31లోపే ద్రవ్య మినిమయ బిల్లుకు సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది.


‘రైతు భరోసా’పై చర్చ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘రైతు భరోసా’ పథకంపై ఈ సమావేశాల్లోనే చర్చను చేపట్టనుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలోని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ బుధవారం నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తూ.. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని జాతీయ రహదారుల్లో కోల్పోయిన, ధనవంతుల భూములకు వర్తింపజేసిందని కాంగ్రెస్‌ సర్కారు ఆరోపిస్తోంది. పైగా.. రైతు భరోసాకు కొత్త విధివిధానాలు తయారు చేస్తామని, అసెంబ్లీలో చర్చకు పెట్టి, సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రైతుబంధు కింద కానీ, రైతు భరోసా ద్వారా కానీ అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదు. ఏటా జూన్‌, జూలై నెలల్లో రైతుబంధు ఇచ్చేవారు. ఇప్పటికే ఆలస్యమై, రైతులు పెట్టుబడి సాయం కోసం చూస్తున్నందున.. తప్పకుండా ఈ సమావేశాల్లోనే రైతు భరోసాపై చర్చ చేపట్టి, అనంతరం విధివిధానాలు రూపొందించాల్సి ఉంటుంది. అందుకే, లఘు చర్చ కింద పథకంపై చర్చను చేపట్టి, సభ్యుల అభిప్రాయాలు తీసుకోనుంది. ఇదే సందర్భంలో రైతు రుణ మాఫీ గురించి కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.


రాష్ట్ర చిహ్నం.. తెలంగాణ తల్లి విగ్రహంపై..

తెలంగాణ రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనపైనా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చ చేపట్టవచ్చని తెలుస్తోంది. వీటిపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో నిపుణులతో చర్చించారు. చిహ్నం నుంచి చార్మినార్‌, కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తారంటూ కథనాలు రావడంతో తీవ్ర వివాదం రేగింది. దాంతో ప్రభుత్వం అప్పట్లో అంశాన్ని వాయిదా వేసింది. అయితే, శాసన సభలో చర్చ చేపట్టి, సభ్యుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవికాక సర్కారు కొన్ని కీలక బిల్లులను కూడా తీసుకొచ్చి సభ ఆమోదం పొందుతుందని సమాచారం. ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ విమర్శిస్తున్నారు. వీటిపై ప్రభుత్వాన్ని అవి గట్టిగా ప్రశ్నించే అవకాశాలున్నాయి.


సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేయండి: స్పీకర్‌

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున... శాసన సభ, శాసన మండలిలో తగిన ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ సెక్రటేరియేట్‌ అధికారులను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆదేశించారు. ముఖ్యంగా బారికేడ్లు, బందోబస్తు, పార్కింగ్‌ వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, సీఎస్‌, డీజీపీలతో తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు.

Updated Date - Jul 12 , 2024 | 04:00 AM