Maha Kumba Mela Record : అత్యధిక జనాభా గల నగరం.. ప్రయాగ్‌రాజ్ ప్రపంచ రికార్డు..
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:26 PM
జపాన్ రాజధాని టోక్యోనే ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కానీ, మహాకుంభమేళా ఎఫెక్ట్‌తో మకర సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్ ఆ రికార్డును బద్ధలు కొట్టింది..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా జనసంద్రంతో హోరెత్తిపోతోంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన మహా కుంభం కావడంతో దేశవిదేశీ భక్తులు, సాధువులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జనవరి 16 పుష్య పౌర్ణమి భోగి పండుగ నాడు కుంభమేళా ప్రారంభం కాగా.. మకర సంక్రాంతి రోజున రికార్డు స్థాయిలో భక్తులు త్రివేణి సంగమానికి హాజరయ్యారు. ఇసుక వేసినా రాలదనే స్థాయిలో ఆ ప్రాంతమంతా భక్తకోటితో కిక్కిరిపోయింది. దీంతో.. ప్రయాగ్‌రాజ్ జనాభా ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. ఆ ఒక్కరోజునే ఏకంగా 4 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయాగ్‌రాజ్‌లో అమృత స్నానాలు చేసినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. దీనికి తోడు జిల్లా జనాభా 70 లక్షలను కూడా కలుపుకుంటే..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా ప్రయాగరాజ్ నిలిచినట్లైంది.
జనవరి 16న ప్రారంభైన ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాకు జనాలు పోటెత్తుతున్నారు. ఈ 45 రోజుల్లో 40 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా. తొలిరోజునే 1.75 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. రెండో రోజు మకర సంక్రాంతి సందర్భంగా ఇంతకు రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదికల ప్రకారం.. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో అమృత స్నానాలు చేశారు. కనివినీ ఎరుగని రీతిలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా ప్రయాగ్‌రాజ్ జనాభా ఒక్కసారిగా పెరిగిపోయి..ఆ ఒక్కరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా రికార్డు సృష్టించింది.
జపాన్ రాజధాని టోక్యోనే ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కానీ, మహాకుంభమేళా ఎఫెక్ట్‌తో మకర సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్ ఆ రికార్డును బద్ధలు కొట్టింది. జనవరి 15 కనుమ రోజున 3 కోట్లమందికిపైగా త్రివేణి ఘాట్‌లో స్నానాలు చేయగా.. ఈ మూడు రోజుల్లో 8 కోట్ల మందికి పైనే మహా కుంభమేళాకి వచ్చినట్లు అంచనా. మహా కుంభమేళాలో మొత్తం 6 పుణ్యస్నానాలు ఉంటాయి. వాటిలో మూడు అమృత స్నానాలు. ఇప్పటికే భోగి, మకర సంక్రాంతి సందర్భంగా రెండు పూర్తవగా..మిగిలిన నాలుగు జనవరి 29 మౌని అమావాస్య నాడు, వసంత పంచమి పురస్కరించుకుని ఫిబ్రవరి 3న, మాఘ పూర్ణిమ సందర్భంగా ఫిబ్రవరి 12న, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు చివరి రాజ స్నానం జరుగుతుంది. కాబట్టి, వచ్చేనెల మరోసారి అత్యధిక ప్రపంచ రికార్డు సాధిస్తుందేమో చూడాలి.