World cup: ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోవాలని కోరుకుంటున్న న్యూజిలాండ్, పాకిస్థాన్.. ఒకవేళ గెలిస్తే..
ABN , First Publish Date - 2023-11-07T12:08:42+05:30 IST
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి సంచలన విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి సంచలన విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో మరో సంచలన విజయం సాధించాలని భావిస్తోంది. అయితే అఫ్ఘానిస్థాన్ అద్భుత ప్రదర్శన న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లను కంగారు పెడుతోంది. ఒకవేళ అప్ఘానిస్థాన్ సెమీస్ చేరితో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు లీగ్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించకతప్పదు. ప్రస్తుతం న్యూజిలాండ్, పాకిస్థాన్ కంటే అఫ్ఘానిస్థాన్ జట్టుకే సెమీస్ చేరేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన అఫ్ఘానిస్థాన్ జట్టు 4 విజయాలు సాధించింది. బలమైన పాకిస్థాన్, ఇంగ్లండ్‌తోపాటు శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను అఫ్ఘాన్ టీం ఓడించింది. దీంతో 8 పాయింట్లతో టేబుల్‌లో ప్రస్తుతం ఆ జట్టు ఆరో స్థానంలో ఉంది.
అప్ఘానిస్థాన్‌తో సమానంగా 8 పాయింట్లే ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు 4, 5వ స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్‌కు ఇంకో ఒక మ్యాచ్ చొప్పున మాత్రమే ఉన్నాయి. కానీ అఫ్ఘాన్ జట్టుకు లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌లు కనుక గెలిస్తే అప్ఘాన్ జట్టు సునాయసంగా సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. అప్పుడు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచిన సెమీస్ చేరే అవకాశాలుండవు. దీంతో అప్ఘానిస్థాన్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని న్యూజిలాండ్, పాకిస్థాన్ కోరుకుంటున్నాయి. కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడిపోవాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే అఫ్ఘానిస్థాన్ మిగిలిన రెండింటిలో ఒకటి గెలిస్తే.. అదే సమయంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీస్ రేసుపై ఉత్కంఠ తప్పదు. అప్పుడు మెరుగైన రన్ రేటు ఉన్న జట్టే సెమీస్ చేరుతుంది. ఒకవేళ అఫ్ఘానిస్థాన్ మిగిలిన రెండింటిలో ఓడి.. పాక్, కివీస్ మిగిలిని ఒక్కో మ్యాచ్‌లో గెలిస్తే అఫ్ఘాన్ జట్టు సెమీస్ రేసులో ఉండదు. అలా కాకుండా పాక్, కివీస్ కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే మళ్లీ నెట్ రన్ రేటు కీలకం అవుతుంది. దీంతో మొత్తంగా అఫ్ఘానిస్థాన్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒకటైనా ఓడితేనే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు సెమీస్ చేరే అవాకాశాలుంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం 5 విజయాలతో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కూడా తమ చివరి రెండు మ్యాచ్‌లో ఓడితే సెమీస్ బెర్త్ కోసం అప్థానిస్థాన్, కివీస్, పాకిస్థాన్ జట్లతో పోటీని ఎదుర్కొవలసి రావొచ్చు. కానీ ఆసీస్‌కు మెరుగైన రన్ రేటు ఉంది. కాబట్టి ఆ జట్టు సెమీస్ చేరడం అంతగా కష్టం కాకపోవచ్చు.
ప్రపంచకప్‌లో మంగళవారం ఆసీస్, అఫ్ఘన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కంగారులు గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. ఒకవేళ అఫ్ఘానిస్థాన్ గెలిస్తే న్యూజిలాండ్, పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంలో పడతాయి. దీంతో ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ ఓడిపోవడం కివీస్, పాకిస్థాన్‌కు అవసరంగా చెప్పుకోవచ్చు. దీంతో ఈ టోర్నీలో పాకిస్థాన్, న్యూజిలాండ్ భవిష్యత్ అఫ్ఘానిస్థాన్ చేతిలో ఉంది. అయితే అప్ఘానిస్థాన్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో బలమైన, మంచి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో తలపడనుంది. దీంతో అఫ్ఘానిస్థాన్ గెలవడం అంత సులువు కాదు. కానీ ఈ టోర్నీలో అఫ్ఘానిస్థాన్ సంచలన విజయాలు సాధించిన రికార్డు ఉంది. దీంతో ఒక వేళ మరోసారి సంచలన విజయాలు సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాగా ఆస్ట్రేలియా తమ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో తలపడనుంది. న్యూజిలాండ్ తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకతో, పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.