Share News

POLITICAL : ఇక సమరమే..!

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:15 AM

సార్వత్రిక ఎన్నికల తొలి అంకం దాదాపుగా ముగిసినట్లే. నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపడుతున్న టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థుల నామినేషన్లన్నీ సరిగ్గానే ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మే 13న జరగనుంది. ఇక కదనరంగంలోకి దూకేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి పక్షం రోజులే...

POLITICAL : ఇక సమరమే..!
Leaders present for consideration of nominations

ప్రధాన ప్రత్యర్థుల నామినేషన్లు ఓకే..

ప్రచార ఉధృతికి సిద్ధమైన టీడీపీ కూటమి

ఏం చెప్పాలో తెలియక వైసీపీలో నైరాశ్యం

ప్రజల్లోకి చొచ్చుకుపోయిన సూపర్‌ సిక్స్‌ పథకాలు

ఏం చేస్తారో ఇంకా చెప్పని సీఎం జగన

అనంతపురం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల తొలి అంకం దాదాపుగా ముగిసినట్లే. నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపడుతున్న టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థుల నామినేషన్లన్నీ సరిగ్గానే ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మే 13న జరగనుంది. ఇక కదనరంగంలోకి దూకేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి పక్షం రోజులే గడువు ఉంది. కూటమి అభ్యర్థులు, అధికార వైసీపీ అభ్యర్థులు ప్రచారం వేగం పెంచేందుకు సమాయత్తమయ్యారు. కూటమి టీడీపీ అభ్యర్థులు వైసీపీ ఐదేళ్ల అరాచక పాలన, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలను ఎండగడుతూ, తమ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిస్తూ... ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇలా ఓట్లను అభ్యర్థించడమే ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార వైసీపీ అభ్యర్థులు నవరత్నాలే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళుతున్నారు.


వీరి మధ్యే పోటీ...

రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి పరిటాల సునీత, అధికార వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి పోటీ పడుతున్నారు. రాయదుర్గం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థిగా ఏపీఐఐసీ చైర్మన, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి తలపడుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. అనంతపురం అర్బన నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌, వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమిఅభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, కళ్యాణదుర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు, వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎంపీ తలారీ రంగయ్య, తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కూటమిఅభ్యర్థిగా జేసీ అశ్మితరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తలపడుతున్నారు. శింగనమల నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ, వైసీపీ అభ్యర్థిగా వీరాంజినేయులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన వీరి మధ్యే పోటీ నెలకొంది. మిగిలినవారి ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని భావిస్తున్నారు. అనంతపురం ఎంపీ స్థానానికి అధికార


వైసీపీ నుంచి పెనుకొండ సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్‌నారాయణ, టీడీపీ కూటమి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలు పోటీలో ఉన్నారు. వీరి మధ్య ప్రధానంగా పోటీ ఉంది.

టీడీపీ అభ్యర్థుల్లో కదనోత్సాహం

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలన అరాచకానికి పరాకాష్టగా నిలవడంతో అన్ని వర్గాల ప్రజలు కూటమి టీడీపీ అభ్యర్థులపైనే ఆదరణ చూపుతున్నారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే సీఎం జగన్మోహనరెడ్డి.. కరువు జిల్లా అనంతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న విషయాన్ని కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. జిల్లాకు జీవనాధారణమైన హంద్రీనీవా విస్తరణ పనులు చేపట్టకపోవడం, మిగిలిన ప్రాజెక్టులను విస్మరించడంతో రైతాంగం పూర్తీస్థాయిలో వైసీపీని వ్యతిరేకిస్తోందన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో తెచ్చిన కియ పరిశ్రమ మినహా... వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోవడం, ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతోంది. వైసీపీ పాలనపై నిరుద్యోగ యువత గుర్రుగా ఉంది. ఇలా అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ఐదేళ్ల పాలనతో పాటు... స్థానిక ప్రజాప్రతినిధులు సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాలన్నింటితో పాటు... టీడీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి... అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చొప్పిస్తూ చైతన్యవంతులను చేస్తున్నారు. అధికార వైసీపీ నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలన్నీ అనుకూలంగా మలుచుకుంటూ గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ఈ పక్షం రోజుల్లో మరింత ఉధృత ప్రచారం దిశగా కార్యచరణ


రూపొందించుకుంటున్నారు.

వైసీపీలో గుబులు

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు అధికమవుతుండటంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో రోజురోజుకు గుబులు పెరుగుతోంది. సీఎం జగన బటన నొక్కుడు తప్ప... జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదన్న అభద్రతాభావం వైసీపీ అభ్యర్థులను వెంటాడుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి పనులు చేశామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పార్టీ వర్గాల్లోనూ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఉద్యోగ వర్గాలు అధికార వైసీపీపై గుర్రుగా ఉన్నాయి. నిరుద్యోగ యువతలోనూ అదే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు అధికార వైసీపీ అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ అజెండాతో ప్రచారంలో ముందుకెళ్లాలో దిక్కుతోచని స్థితిని అధికార పార్టీ అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గాల్లో


తమ బలంగా చెప్పుకునే రెడ్డి సామాజికవర్గం నేతలు సైతం టీడీపీ బాట పట్టడంతో తీవ్ర నైరాశ్యాన్ని ఎదుర్కొంటున్నారు. సీఎం జగన త్వరలో విడుదల చేసే మేనిఫేస్టోపైనే ఆ పార్టీ అభ్యర్థులు ఆధారపడి ఉన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫేస్టో అంశాలనే అమలు చేయకపోవడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. త్వరలో విడుదల చేసే మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతారా..? లేదా? అనే ప్రశ్న ఆ వర్గాల్లోనే ఉత్పన్నమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోతుండటం వైసీపీ అభ్యర్థులను మరింత ఇబ్బందిపెడుతోంది. వైసీపీ అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 27 , 2024 | 01:15 AM