TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేత..
ABN , Publish Date - Dec 17 , 2024 | 01:02 PM
మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలకనేత ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆళ్ల నాని కూడా టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు.
ఏలూరు: మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలకనేత ఆళ్ల నాని రేపు(బుధవారం) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆళ్ల నాని పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఏలూరు నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఆళ్ల నాని చేరికను తీవ్రంగా నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లానని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు.
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే బడేటి చంటి
ఐదేళ్ల కాలంలో పార్టీకి కష్టపడి పనిచేసిన వారు కార్యకర్తలు అని.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. చాలా మంది కార్యకర్తలు ఆళ్ల నాని టీడీపీలో చేరడంపై అయిష్టంగా ఉన్నారని అన్నారు. 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆళ్ల నాని చెప్పారు. అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యమన్నారు. రేపు ఉదయం 11గంలకు ఆళ్ల నాని టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రకటించారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకే సిద్ధమవుతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయ్యి టీడీపీలో చేరిపోగా, ఆ పార్టీకి ఇంతకు ముందే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఆళ్ల నాని రెండు నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా దానికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. గడచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
జగన్ వైఖరిని నిరసిస్తూ..
వైసీపీ అధినేత జగన్ వైఖరిని నిరసిస్తూ వైసీపీలో ఇమడలేక రాజీనామా చేసిన నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. అలాంటి వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు నియో జకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయింది. టీడీపీ లో చేరిపోగా ఇంతకుముందే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నేడు సైకిల్ ఎక్కబోతున్నారు. రెండు నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వా నికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన కొద్దికాలం సైలెంట్‌గా ఉన్నారు. తరువాత హైదరాబాద్, మరికొన్ని రహస్య ప్రదేశాల్లో టీడీపీ నేతలతో భేటీ అవుతూ వచ్చారు. పైకి సమాచారం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుం టూనే తెలుగుదేశంలో చేరేందుకు ఆళ్ల నాని తన శక్తియుక్తులను ఉపయోగించారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీలో చేరతారని కొన్నాళ్ల క్రితమే ప్రచారం సాగింది.
గ్రీన్ సిగ్నల్ ..
చాలామంది ఇదే పంథా అనుసరించారు. స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆళ్ల నాని టీడీపీలో చేరికను తోసిపుచ్చింది. తాము బలంగా ప్రజా మోదంతో గత ఎన్నికల్లో 62 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందితే పార్టీకి ఆళ్ల నాని అవసరం ఏమిటన్నట్టుగా కిందిస్థాయి కేడర్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆళ్ల నాని మీడియా, స్థానిక నేతలెవరికీ ఫోన్‌లోకి సైతం టచ్‌లోకి రాలేదు. టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని ఖరారు చేసేం దుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. గడిచిన రెండు నెలలుగా టీడీపీలో ఓ ముఖ్య నేత ఆళ్ల నానికి మద్దతుగా నిలిచి ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి దాదాపు అన్ని రూట్లను క్లియర్ చేసినట్టు భావిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా ఆళ్ల నాని విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించి తదుపరి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతర్గ తంగా ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వక పోయి నా పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకే నాని కూడా సమ్మతించినట్టు సమాచారం.
వైసీపీ ఆవిర్భావం నుంచి..
ఆళ్ల నాని వైసీపీ ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరారు. వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా గడిచిన రెండున్నర దశాబ్దాల నుంచి ఆయన కొనసాగుతూ వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అంతలా వైసీపీలో ఆయన ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, విభజిత ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా ఎమ్మెల్సీగా కొన్నాళ్లు వ్యవహరించారు.
వైసీపీ కార్యకలాపాల్లో సైలెంట్..
గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాల్లో సైలెంట్ అయ్యారు. పార్టీ అధినాయకత్వంతో ఆయన దాదాపు విభేదించారు. దానికి గల కారణాలేవీ ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఆయన కూడా నోరువిప్పి ఎవరికీ చెప్పుకోలేదు. దీనికితోడు ఆళ్ల నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఏలూరు మేయర్, మరి కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆళ్లనాని తెలుగుదేశంలో చేరుతున్నట్టు సమాచారం అందింది. బుధవారం ఆయన అధికారికంగా సైకిల్ ఎక్కబోతున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీపీ అధిష్ఠానం వర్తమానం పంపింది.
పెదవి విరిచిన కేడర్
ఏలూరులో ఎలాంటి అడ్డంకులు లేకుండా పార్టీ సభ్యత్వ నమోదు, పాలనా వ్యవహారాల్లో ఏకచత్రాధిపత్యంగా ఎమ్మెల్యే బడేటి చంటి, ఆయన వెంట ఉన్న కేడర్ ఉత్సాహంగా ఉన్నారు. ఆళ్ల నాని చేరిక అంటూ ప్రచారం జరిగినప్పుడే కేడరంతా దాదాపు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే చంటి మాత్రం దీనిపై ఎక్కడా నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల నానిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే తిరిగి వ్యవహారం మారుతుందన్న వాదనే అత్యధికుల్లో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP : సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి
Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి
AP Skill Development : ఏపీలో 532 స్కిల్ హబ్‌లు
Read Latest AP News and Telugu News