Share News

CM Chandrababu: టీడీపీ సభ్యత్వ నమోదుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 31 , 2024 | 09:59 PM

CM Chandrababu: గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎడాపెడా జగన్ అప్పులు చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లు నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిన పెట్టడం వల్ల ప్రజల్లో మరింత నమ్మకం వచ్చిందని అన్నారు. జగన్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

CM Chandrababu: టీడీపీ సభ్యత్వ నమోదుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
CM Chandrababu

అమరావతి: టీడీపీ సభ్యత్వ నమోదు గడువు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డులు తిరగరాస్తుందని చెప్పారు. ప్రతి రోజూ సగటున లక్షన్నర మంది టీడీపీ సభ్యత్వ స్వీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ కేడర్ విన్నపంతో సభ్యత్వ నమోదు గడువు 15 రోజులు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 94 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. గత 63 రోజుల్లో రోజూ సగటున లక్షన్నర మంది సభ్యత్వం స్వీకరణ తీసుకుంటున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు గడువు పెంచాలని విన్నవించడంతో గడువు పొడిగించినట్లు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు.


రికార్డు స్థాయిలో సభ్యత్వాలు

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీల కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. మీ కుటుంబాల్లో వెలుగులు నిండి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు అన్నారు. 2024 మనకు ఇన్‌స్పైరింగ్ సంవత్సరమన్నారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్లడంతో ఈ ఏడాది ఎన్నికల్లో మనకు తిరుగులేని విజయం దక్కిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా దశదిశ నిర్ధేశించుకుని ముందుకెళ్తామని అన్నారు. సభ్యత్వాల నమోదులో కార్యకర్తలు, నాయకులు చూపిన చొరవ స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు మన పార్టీకి ఉన్నారని అన్నారు. అక్టోబర్ 26న ప్రారంభించిన సభ్యత్వాలు నేటికి 93 లక్షలు దాటాయని చెప్పారు. అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా సభ్యత్వాలు నమోదవుతున్నాయన్నారు. ఈ ఉత్సాహం చూస్తే సభ్యత్వాల సంఖ్య కోటి దాటే అవకాశం ఉందని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి ఇన్ని సభ్యత్వాలు నమోదు చేయగలిగామన్నారు. రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా అందించబోతున్నామని చెప్పారు. గ్రామాల్లోనూ పోటీపడి సభ్యత్వాలు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.


కొత్తగా రిఫరల్ విధానం..

chandrababu2.jpg

తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదవుతున్నాయన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను నేరుగా గుర్తించేందుకు ఈ సారి కొత్తగా రిఫరల్ విధానం తీసుకొచ్చామని అన్నారు. గత ఐదేళ్లలో రూ.135 కోట్లను కార్యకర్తల సంక్షేమ నిధికి ఖర్చు పెట్టామని చెప్పారు. పాలకొల్లు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, కుప్పం, రాజంపేట, ఉండి, కళ్యాణదుర్గం, గురజాల, వినుకొండ, మంగళగిరి నియోజకవర్గాలు మొదటి 10 స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. శాశ్వత సభ్యత్వాల్లో మంగళగిరి(112), ఆత్మకూరు(85), జీడీ నెల్లూరు(61), పెదకూరపాడు(50), తణుకు(44), ఉండి (36) నియోజకవర్గాలు టాప్‌లో ఉన్నాయని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు నేటితో ముగించాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల విజ్ఞప్తి మేరకు మరో 15 రోజుల సమయాన్ని పెంచుతున్నామన్నారు. మహానాడులోపు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, అనుబంధ సంఘాల పదవులన్నీ పార్టీ కోసం కష్టపడ్డవారికే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిల్లో పని చేసిన వారికి పార్టీ పదవులు ఇస్తామని మాటిచ్చారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోవని చెప్పారు. గత ఐదేళ్లు కార్యకర్తలను కాపాడుకోవడానికి పని చేశానని గుర్తుచేశారు. ఇప్పుడు గుర్తించడానికి పనిచేస్తానని అన్నారు. ఆరు నెలల పాలనలో అనేక కార్యక్రమాలు అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఏపీకి ఈ ప్రాజెక్ట్‌ గేమ్ ఛేంజర్..

గోదావరి నీటిని బనకచర్లకు తీసుకెళ్లి తెలుగుతల్లికి జలహారతి ఇస్తామని ప్రకటించారు. ఇది పూర్తయితే రాష్ట్రంలో కరువు ఉండదని స్పష్టం చేశారు. ఏపీకి ఈ ప్రాజెక్ట్‌ గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఈ రాష్ట్రానికి ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు. తద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 2029 ఎన్నికలకు మనం ఇప్పటి నుంచే పని చేయాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని అన్నారు. పెన్షన్లు కూడా ఇంటికెళ్లి ఇస్తున్నారా లేదా అన్నది జియోట్యాగింగ్ ద్వారా తెలుసుకుంటున్నామన్నారు.వాట్సాప్ గవర్నెన్స్‌ను కూడా తీసుకురాబోతున్నామని ప్రకటించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్నారు. ఎవరూ అజాగ్రత్తతో ఉండొద్దని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.


ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

ముఖ్యమంత్రిగా ఒకపక్క పాలన సాగిస్తూనే మరోవైపు కార్యకర్తలకు సమయం కేటాయిస్తున్నానని తెలిపారు. కార్యకర్తలను నాయకులు కలుపుకుని వెళ్లాలని సూచించారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని... ఎడాపెడా అప్పులు చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లు నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిన పెట్టడం వల్ల ప్రజల్లో మరింత నమ్మకం వచ్చిందని అన్నారు. జగన్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందన్నారు. మధ్య నిషేదం, సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీలు తామెప్పుడు ఇచ్చామని బుకాయించారని చెప్పారు. రైతు భరోసా, చేయూత పథకాల్లోనూ రైతులు, మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. సూపర్-6 హామీలను తప్పకుండా నెరవేర్చుతామని. అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. పెంచిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు చేస్తామన్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్‌ విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. మన ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లు పెన్షన్‌కు ఖర్చు చేస్తోందని చెప్పారు. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో పెన్షన్లు ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట

AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ

AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 10:16 PM