Rain Effect: ప్రకాశం బ్యారేజ్‌కి స్వల్పంగా తగ్గిన వరద ఉద్ధృతి..
ABN , Publish Date - Sep 03 , 2024 | 07:31 AM
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు నిన్న(సోమవారం) విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయి వరదనీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.47లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో ఇదే రికార్డుస్థాయి వరద అంటూ జలవనరుల శాఖ, సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.
అమరావతి: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు నిన్న(సోమవారం) విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయి వరదనీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.47లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో ఇదే రికార్డుస్థాయి వరద అంటూ జలవనరుల శాఖ, సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. పైనుంచి నీటి ఉద్ధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 9.79లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నిన్న ఇదే సమయానికి 11.30లక్షల క్యూసెక్కులు ఉండగా... మధ్యాహ్నానికి 11.47లక్షలకు చేరుకుంది.
కోలుకుంటున్న విజయవాడ..
చరిత్రలో ఇదే రికార్డుస్థాయి నీటిమట్టం అని, అయినా ప్రకాశం బ్యారేజ్ తట్టుకుని నిలబడినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నానికి నీటిమట్టం మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటిమట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్‌లో వాటర్ వెనక్కి వెళ్లుతున్నాయి. వరదనీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మెున్న రిటైనింగ్ వాల్ లీక్ కావడంతో రామలింగేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. అటు బుడమేరు, ఇటు కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో వరదనీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు అనుభస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు నిన్నట్నుంచి కరెంట్ సరఫరా ప్రజలు నిలిపివేశారు.
ముంపులోనే లంక గ్రామాలు..
మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గటంతో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగాయలంక, శ్రీరామపాద క్షేత్రం ఘాట్ వద్ద అడుగు మేర వరద నీటిమట్టం తగ్గింది. కరకట్టకు సమాంతరంగా నీరు ప్రవహించడంతో నదీ తీర గ్రామాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తాగునీరు, ఆహారం సరఫరా చేయాలంటూ కోరుతున్నారు.