Sri Bharat: వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు సేఫ్టీ ఆడిట్ చేయలేదు
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:22 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు సేఫ్టీ ఆడిట్ ఎందుకు చేయలేదని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీకన్నా ఎక్కువ ఫార్మా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు.

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు సేఫ్టీ ఆడిట్ ఎందుకు చేయలేదని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీకన్నా ఎక్కువ ఫార్మా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. అక్కడ బారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ అక్కడ ఎక్కువ ఎందుకు ప్రమాదాలు జరగడం లేదో ఆలోచించాలని తెలిపారు. అబద్దాలు వందసార్లు చెప్పినా అది నిజం అయిపోతుందా అని నిలదీశారు. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కానీ తమపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని శ్రీ భరత్ మండిపడ్డారు.
చంద్రబాబును విమర్శించే హక్కు జగన్‌కి లేదు: ఎమ్మెల్యే వెలగపూడి
ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలా మాటలు చెప్పారని... ఏమైనా నెరవేర్చారా అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. చంద్రబాబును విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. జగన్‌కి ఈ జన్మలో బుద్ధి రాదని రామకృష్ణ బాబు చెప్పారు.
జగన్ ఇప్పటికైనా మారాలి: గండి బాబ్జి
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారాలని కోరుతున్నామని ఎమ్మెల్యే గండి బాబ్జి తెలిపారు. పాలిమర్స్ ఘటన తర్వాత చనిపోయిన బాధితులకు సైతం జగన్ న్యాయం చేయలేదని అన్నారు. ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పినా.. జగన్ మాట, వ్యవహార తీరు మారట్లేదని గండి బాబ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
నెల్లూరు: రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకయ్య స్వామి 42వ ఆరాధన మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలను దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమానికి వచ్చే భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వెంకయ్య స్వామి ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగి ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.