KTR: సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతోంది: ఎమ్మెల్యే కేటీఆర్..
ABN , Publish Date - Sep 02 , 2024 | 11:13 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని వంచించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని వంచించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకాలని, చేనేతలను కన్నింటి రెప్పలా కాపాడుకుంటామంటూ పలు పథకాలు ఆశ చూపి ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఆర్డర్ల నిలిపివేత కరెక్టేనా?..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సిరిసంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ నేడు ఉరిసిల్లగా మారుతోందని కేటీఆర్ అన్నారు. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోందని ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. నేతన్నల బతుకుకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసి వాళ్ల పొట్ట కొట్టటం న్యాయమేనా? అంటూ ప్రశ్నించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారికి ఉపాధి లేకుండా చేయడం సమంజసమా అని రాసుకొచ్చారు. ఇది ప్రజాపాలనా? ప్రజల ప్రాణాలు తీసే పాలనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆయన మొద్దునిద్ర నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే సోయి వస్తుందో చెప్పాలంటూ మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలను వెంటనే చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరొక్క ప్రాణం పోయినా ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలి పెట్టవద్దని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ మంచి చేసి నేతన్నల ప్రాణాలు నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఉచిత విద్యుత్ ఏమైంది?..
ఎన్నికలకు ముందు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు 5నెలల బకాయిలు చెల్లించాలంటూ ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. చాలా మంది లబ్ధిదారులను మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలని, ఐదు నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వం చెప్తోందని, ఇది ఎంతవరకు కరెక్టో చెప్పాలని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వ చర్యల ద్వారా అర్థమవుతోందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ఆ పార్టీ నేతలు యూటర్న్ తీసుకుంటున్నారని అన్నారు. కరెంట్ బిల్లులు సోనియాగాంధీ కడతారని.. మీరెవ్వరూ కట్టాల్సిన పనిలేదంటూ హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలంటూ వేధిస్తున్న అధికారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత, నయవంచన వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Dams: భారీ వరదలకు తెలంగాణ ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..
Rain Effect: పెద్దపల్లిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..
CM Revanth Reddy: అధికారులతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి..