Etela Rajender: జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిందే.. ఈటల డిమాండ్
ABN , Publish Date - Jul 20 , 2024 | 05:07 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని, కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలోనే పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రమే ఓటర్లు కాదు.. ప్రజలే మళ్లీ ఓట్లు వేయాలన్న విషయం రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు (శనివారం) ఇందిరాపార్క్ వద్ద బీజేవైఎం మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలో ఈటల పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల తర్వాత ప్రజల దగ్గరకు రావాలని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రేవంత్‌కు వందేళ్ల కోసం ప్రజలు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. భేషజాలకు పోకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఇచ్చిన హామీలనే నిరుద్యోగులు అడుగుతున్నారని గుర్తుచేశారు. అమలు చేసే దమ్ముంటేనే ఎన్నికల్లో హామీలు ఇవ్వాలని చెప్పారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. గ్రూప్ - 01లో 01:100 ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఇబ్బంది లేకపోవచ్చు కానీ నిరుద్యోగులది ఇల్లు గడవని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళ్ల కిందకి నీళ్లు వస్తే.. రేవంత్ రెడ్డికి తెలుస్తుందని చెప్పారు. రేవంత్ చేసే మంచి, చెడు ఏంటో నిరుద్యోగులు లెక్క కడుతున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.