Share News

KTR: భారీగా డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ చర్యలేవీ..?.. ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం

ABN , Publish Date - Aug 25 , 2024 | 10:09 AM

తెలంగాణలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర అనారోగ్యం బారీన పడుతున్నారు. పదుల సంఖ్యలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల బాట పడుతున్నారు.

KTR: భారీగా డెంగ్యూ కేసులు..  వైద్యశాఖ చర్యలేవీ..?..  ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం
KTR

హైదరాబాద్: తెలంగాణలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర అనారోగ్యం బారీన పడుతున్నారు. పదుల సంఖ్యలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల బాట పడుతున్నారు. వర్షాకాలం వస్తే డెంగ్యూ కేసులు పెరిగి ఆస్పత్రుల వద్ద రోగులు క్యూ కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రమంగా సీజనల్ వ్యాధులు పెరిగి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.


ఆస్పత్రులకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో నిండిపోతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. కాగా, కేసులు పెరుగుతుండటం, నలుగురు రోగులు మృతిచెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణలో ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు పెరుగుతునప్పటికీ వైద్యశాఖ పర్యవేక్షించట్లేదని విమర్శలు చేశారు. కేసుల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యశాఖ వద్ద ప్రణాళికలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, డెంగ్యూపై అవగాహన కల్పించాలని సూచించారు.


ముఖ్యంగా బ్లడ్‌ ప్లేట్‌లెట్స్‌ అందుబాటులో ఉంచాలని కేటీఆర్‌ సూచించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసిందని కేటీఆర్‌ మండిపడ్డారు. డెంగ్యూతో సహా విజృంభిస్తున్న విష జ్వరాలతో జనం పరేషాన్ అవుతున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల బెడద నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు.


ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గాడితప్పుతున్న ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి సమీక్షలేవి?, ఢిల్లీకి 20 సార్లు వెళ్లే తీరికుంది కానీ.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదా? అని కేటీఆర్‌ నిలదీశారు. చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రజల ప్రాణలంటే అంత లెక్కలేనితనమా? అని అడిగారు. వెంటనే విషజ్వరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 25 , 2024 | 10:54 AM