Share News

Minister Ponguleti: అమరావతిపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 15 , 2024 | 09:57 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అమరావతిని (Amaravati) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు.

Minister Ponguleti: అమరావతిపై మంత్రి పొంగులేటి  షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అమరావతిని (Amaravati) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోతాయని అపోహ పడుతున్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు తగ్గిపోతాయని 10 రోజులుగా ఒక రకమైన చర్చ జరుగుతోంది. అమరావతికి పెట్టుబడులు వస్తే రావొచ్చేమో గానీ.. హైదరాబాద్‌కు నష్టం కలుగుతుందనేది మాత్రం ఒక అపోహ మాత్రమేనని అన్నారు.


హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి...

టైమ్స్ అఫ్ ఇండియా గ్రూప్స్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్ పోను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈరోజు(శనివారం) మంత్రి పొంగుటేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ‘టైమ్స్ హోమ్ హంట్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో నాలుగో ఎడిషన్ నిర్వహించారు. అమరావతితో, హైదరాబాద్‌నూ పోలిస్తే హైదరాబాద్ స్థానం హైదరాబాద్‌కే ఉందని చెప్పారు. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆర్ఆర్ఆర్, రిజినల్ రింగ్ రోడ్, మెట్రో డెవలప్మెంట్, మూసి డెవలప్మెంట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు.


రియల్ ఎస్టేట్ రంగానికి భాగ్యనగరం సేఫెస్ట్ ప్లేస్..

రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కంపెనీలు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. రెండు రోజుల్లో ఈ అంశాలపై చర్చిస్తాం. పక్కరాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందని, మన దగ్గర ఏదో జరుగుతుందని అపోహ పడవద్దని అన్నారు. బిల్డర్లకు న్యాయమైన అన్ని అంశాల్లో సపోర్ట్ చేస్తామన్నారు. పేదవాడికి మంచి చేసే పనులకు సహకరిస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పాలసీల విషయంలో ప్రభుత్వం అండ గా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

PONGULETI.jpg


హైదరాబాద్‌‌లో దిగ్గజ సంస్థలు ...

ఎన్నికల కోడ్ కారణంగా ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధిపై ఫోకస్ పెడతామని అన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలమని అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుకు కారణం. దేశంలోనే ప్రత్యేకమైన, అరుదైన నగరం ఇది. ఈ నగరానికి వచ్చిన ప్రమాదం ఏమీలేదు. ఇప్పటికే దేశ విదేశాల దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరిన్ని సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


త్వరలో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు

ఆదిభట్లలో అతి త్వరలో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు ప్రారంభించబోతోందన్నారు. రానున్న రోజుల్లో ఆ ప్రాంతంలో విశేష అభివృద్ధిని చూస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణం కనిపించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను తీసుకురాబోతున్నామని వివరించారు. ఇక RRR ప్రాజెక్టు హైదరాబాద్‌తో పాటు తెలంగాణకే ‘గేమ్ ఛేంజర్’ లాంటిది. ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ పారిశ్రామికంగా, అర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఇళ్లు, విల్లాల నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున స్థలాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొండాపూర్, పటాన్‌చెరు, శంషాబాద్, కోకాపేట ప్రాంతాల్లో ఇప్పటికే విపరీతమైన డిమాండ్ ఉందని గుర్తుచేశారు.


హెచ్ఎండీఏ విస్తరణ..

తాజాగా ఉప్పల్, ఎల్‌బీనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణపై ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఉన్నాయన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని చెప్పారు. మూసీ పరిసర ప్రాంతాలన్నీ అద్భుతంగా రూపుదిద్దుకోనున్నాయని అన్నారు. ఫార్మాసిటీ, సెమీ కండక్టర్ పాలసీ, హెల్త్ సెక్టార్, పర్యాటకం రంగాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇక అత్యంత ముఖ్యమైన అంశం.. హెచ్ఎండీఏ(HMDA) పరిధి విస్తరణ. ఓఆర్‌ఆర్ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయని తెలిపారు. శివారు ప్రాంతాలలోని మరిన్ని గ్రామాలు హైదరాబాద్ నగరం పరిధిలోకి వస్తాయన్నారు. ఇవన్నీ హైదరాబాద్ నగర అభివృద్ధికి, ఇక్కడ సొంతిళ్లు నిర్మాణం చేసుకొని స్థిరపడటానికి, వ్యాపారం చేసుకొని పైకి ఎదగడానికి పుష్కలంగా అవకాశం కల్పిస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 15 , 2024 | 10:30 PM