Share News

Hyderabad: ఆ నివేదిక తర్వాతే ‘చైర్మన్‌ గిరీ’!

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:29 AM

రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Hyderabad: ఆ నివేదిక తర్వాతే ‘చైర్మన్‌ గిరీ’!

  • లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతల పనితీరుపై కురియన్‌ కమిటీ సమీక్ష

  • నివేదిక ఇచ్చాకే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించిన నేతలు, పార్టీ కోసం దీర్ఘకాలికంగా పనిచేసున్న వారికి అవకాశం కల్పిస్తూ మార్చి 14న37 మందితో జాబితాను వెలువరించింది. కానీ, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సంబంధిత శాఖలు కార్పొరేషన్లకు జీవోను పంపలేదు. దీంతో ఆ 37 మంది బాధ్యతలు స్వీకరించలేదు. తీరా ఎన్నికలు ముగిశాక.. కొందరు మంత్రులు నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తొలి జాబితాలో ఉన్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతల పనితీరును సమీక్షించిన తర్వాతే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయించడంతో తొలి జాబితాలో అవకాశం దక్కిన నేతలు నాలుగు నెలలుగా ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కురియన్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక తర్వాతే నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 10న కురియన్‌ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. అంటే మరో వారం రోజుల తర్వాతే కార్పొరేషన్ల చైర్మన్లకు ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి.


నాలుగు నెలలుగా నిరీక్షణ..

37 మందితో విడుదల చేసిన జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, ఈరవత్రి అనిల్‌ కుమార్‌, గుర్నాథరెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సతీమణి నిర్మల, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి, నేతలు తేజావత్‌ బెల్లయ్య నాయక్‌, నేరెళ్ల శారద, శివసేనారెడ్డి, పటేల్‌ రమే్‌షరెడ్డి, కాల్వ సుజాత తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు ఆయా కార్పొరేషన్లకు వెళ్లి చాంబర్లు కూడా చూసుకున్నారు. మరికొందరు ఆధునికీకరించుకున్నారు. కానీ, అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో బాధ్యతలు స్వీకరించలేకపోయారు. చైర్‌పర్సన్‌ పోస్టులు పొందిన నేతలు కొందరు సీఎం రేవంత్‌రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని, సంబంధిత శాఖల మంత్రులను కూడా కలిసి.. కృతజ్ఞతలు తెలిపారు. కానీ, జీవో సర్క్యులేట్‌ కాకపోవడంతో బాధ్యతలు స్వీకరించడానికి వెనకడుగేశారు. చివరకు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత బాధ్యతలు స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చారు.


కోడ్‌ ముగిసిన తర్వాత ముహూర్తాలు కూడా చూసుకున్నారు. ఈలోగా పోస్టుల భర్తీపై మంత్రుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పరకాల టికెట్‌ ఆశించి, భంగపడిన ఇనుగాల వెంకట్రామిరెడ్డికి వరంగల్‌ ‘కుడా’ చైర్మన్‌ పదవిని ఇచ్చారు. దీనిపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఇక కరీంనగర్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని ‘సుడా’ చైర్మన్‌గా నియమించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వర్గానికి చెందిన నరేందర్‌రెడ్డి నియామకాన్ని మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నామినేటెడ్‌ పోస్టుల నియామకంపై అసంతృప్తితో ఉన్న ఇద్దరు, ముగ్గురు మంత్రులు.. జాబితా మార్చాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.


నివేదిక తర్వాతే ఉత్తర్వులు?

లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు పనిచేశారు? ఎవరు పనిచేయలేదు? సీట్లు తగ్గడానికి గల కారణాలు ఏమిటి? అనే అంశాలపై కురియన్‌ కమిటీ నివేదిక తయారుచేస్తోంది. దాన్ని ఈ నెల 10న పార్టీ అధినాయకత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే నామినేటెడ్‌ పోస్టులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఎన్నికలను భుజాన వేసుకొని పనిచేసినవారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని, పార్టీ పదవులు దక్కుతాయని అధిష్ఠానం ఎన్నికలకు ముందే స్పష్టంగా ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్‌ నియామక ప్రక్రియలను కూడా కురియన్‌ నివేదికకు ముడిపెట్టినట్లు సమాచారం.


ఎమ్మెల్యేలకు కూడా..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ), రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లాంటి కీలకమైన కార్పొరేషన్లు కొన్నింటిని పెండింగ్‌లో పెట్టారు. వీటికి చైర్మన్లుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తొలి జాబితాకు అనుమతి వచ్చిన తర్వాతే మిగిలిన కీలక కార్పొరేషన్లకు చైర్మన్ల పోస్టులను భర్తీచేసే అవకాశాలున్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 03:29 AM