Kotamreddyకి బెదిరింపు కాల్స్.. బయటపడ్డ బోరుబడ్డ అనిల్ ఆడియో

ABN , First Publish Date - 2023-02-04T09:11:43+05:30 IST

సీఎం జోలికి వచ్చినవంటే... బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీలోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా..

Kotamreddyకి బెదిరింపు కాల్స్.. బయటపడ్డ బోరుబడ్డ అనిల్ ఆడియో

నెల్లూరు : ఇటీవల ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఎంతగా హాట్ టాపిక్ అవుతున్నారో చెప్పనక్కర్లేదు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారంటూ ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చారు. తనను అనుమానించారని.. అలాంటి పార్టీలో తాను ఉండలేనని వెల్లడించారు. తానేమీ సీఎం జ‌గ‌న్‌ (CM Jagan)కు నమ్మకద్రోహం చేయ‌లేద‌ని.. మనసు విరిగింది కాబట్టే బయటకు రావాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీకి దూరమైతే ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా బయటకు వచ్చానన్నారు. తనను ఎన్‌కౌంటర్ చేయిస్తే తప్ప తన మాటలు ఆగవని స్పష్టం చేశారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు సంధిస్తున్న నాటి నుంచి వైసీపీ నేతల (YCP Leaders) నుంచి కోటంరెడ్డి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు. మరోవైపు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కోటంరెడ్డి సైతం వెల్లడించారు.

తాజాగా కోటంరెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్ ఒకటి సోషల్ మీడియా (Social Media)లో బాగా వైరల్ అవుతోంది. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కడప జిల్లా వైసీపీ శ్రేణులు దుర్భాషలాడుతూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. వైసీపీ నేత బోరుబడ్డ అనిల్‌ (Borugadda Anil).. కోటంరెడ్డిని బెదిరిస్తున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోటంరెడ్డి తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడని.. వెంటనే వచ్చి సీఎం జగన్‌కి క్షమాపణ చెప్పాలంటూ అనిల్ బెదిరింపులకు పాల్పడ్డారు. సజ్జల (Sajjala) సహా ఇతర పార్టీ పెద్దల గురించి మాట్లాడితే మాత్రం మీ కథ తేలుస్తా అంటూ ఆడియోలో కోటంరెడ్డిని హెచ్చరించారు.

‘‘జగన్ చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడివా? తిన్నింటివాసాలు లెక్కపెట్టావ్. మర్యాదగా సీఎం జగన్ దగ్గరకి వచ్చి క్షమాపణ చెప్పు. లేదంటే ప్రజాగ్రహానికి గురవుతావ్. సీఎం జోలికి వచ్చినవంటే... బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీ (TDP)లోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా.. రాజారెడ్డిని, వైఎస్ ని ఏకవచనంతో మాట్లాడుతావా... నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మీరు పోవాలంటే పోండి. నువ్వు నీ కథ మొత్తం తెలుసు.. సిగ్గుండాలి. ఇంకోసారి జగన్ గురించి మాట్లాడితే నీ ఇంటికొచ్చి బండికి ఈడ్చుకుపోతా. నిన్ను.. నీ తమ్ముడిని జనం కుమ్మి పడేస్తారు. ఈ రోజు నుంచి నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో.. ఆ దేవుడే నీకు శాపం ఇస్తాడు. చంద్రబాబు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? చంద్రబాబు (Chandrababu)(బూతు) గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? నన్ను రమ్మంటావా? నువ్వొస్తావా? ఆ రోడ్డులో కుక్కను ఈడ్చుకుపోవచ్చు.. నిన్ను ఈడ్చుకుపోవచ్చు. సజ్జల, మిగిలిన పార్టీ పెద్దల గురింవి మాట్లాడితే... మీ‌ కథ తేలుస్తా’’ అని అనిల్ బెదిరింపులకు పాల్పడ్డారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-04T10:05:23+05:30 IST