CM Revanth Reddy : బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం!
ABN , Publish Date - Aug 17 , 2024 | 05:12 AM
బీఆర్‌ఎస్ పార్టీ.. బీజేపీలో విలీనం అయ్యే అవకాశముందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేరసారాలు వివిధ స్థాయుల్లో జరుగుతున్నాయని, కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారు
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు
కవితకు బెయిల్.. రాజ్యసభ ఎంపీ పదవి
ఎస్సీ వర్గీకరణపై మోదీ సర్కారుకు విధానమన్నదే లేదు
మా కుటుంబ సభ్యులకు ఎక్కడా, ఏ పదవీ ఇవ్వలేదు
నేను సీఎం అయితే వారు దందాలు చేయొద్దా?: రేవంత్
ఖర్గేతో భేటీ.. పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులపై చర్చ
క్యాబినెట్ విస్తరణ మీడియా సృష్టేనన్న ముఖ్యమంత్రి
ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్!.. సీఎంతో కంపెనీ చైర్మన్ భేటీ
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ.. బీజేపీలో విలీనం అయ్యే అవకాశముందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేరసారాలు వివిధ స్థాయుల్లో జరుగుతున్నాయని, కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీఆర్‌ఎ్‌సకు ఉన్న నలుగురు ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రె్‌సపై బీఆర్‌ఎస్, బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశాయని అన్నారు. ఎన్నికల ముందు.. కాంగ్రెస్ పోటీలోనే లేదన్నారని, తాము అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారని గుర్తు చేశారు.
కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా? ఉండదా? అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ ఆరోపించారు. మందకృష్ణ మాదిగకు ప్రధాని మోదీ ‘బిగ్ హగ్’ ఇవ్వడం తప్ప.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదన్నారు. వర్గీకరణకు అనుకూలంగా ఉంటే పార్లమెంటులో బిల్లు పెట్టి కేంద్రం ఆమోదించుకునేదని తెలిపారు.
జాతీయ స్థాయిలో పాలసీ కావాలంటే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం చాన్నాళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రముఖ న్యాయవాదులతో వాదనలు వినిపించామని చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ అధ్వర్యంలో క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశామని, ఢిల్లీకి కూడా ప్రతినిధుల బృందాన్ని పంపామని తెలిపారు. వర్గీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చామని, రాహుల్‌గాంధీ కూడా ప్రచారంలో చెప్పారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది పొలిటికల్ రిజర్వేషన్ కాదని, ఉద్యోగాలు, పదోన్నతులకు సంబంధించింది మాత్రమేనని అన్నారు.
మా విధానాలు చెప్పేందుకే విదేశీ టూర్..
విదేశీ పర్యటనపై ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున.. పాలసీలో మార్పులు ఉంటాయేమోనన్న అనుమానాలుంటాయి. అందుకే మా పాలసీ ఇదీ అని చెప్పుకోవడానికే వెళ్లాం. పెట్టుబడులు పెట్టాలని కంపెనీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ పాలసీ కింద తీసుకుంటే తప్ప పెట్టుబడులు రావు.
మనం వెళ్లి ప్రభుత్వ విధానాలు ఏంటో వివరిస్తే వారు చర్చించుకుంటారు కదా! కలిసినోళ్లంతా, పెట్టుబడులు పెడతానన్నోళ్లంతా పెడతారనే గ్యారెంటీ లేదు. ఢిల్లీలో ఉన్నవాళ్లకే హైదరాబాద్‌లో ఏముందో తెలియదు. అమెరికాలో ఉన్న వాళ్లకి ఏం తెలుస్తుంది? ఇంకో రెండేళ్ల తర్వాతనైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచించుకుంటారు కదా!’’ అని సీఎం రేవంత్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం మోదీ ఇష్టమని, తాను ప్రయత్నం మాత్రం చేస్తున్నానని చెప్పారు.
తనకు అందరితోనూ వ్యక్తిగత సంబంధాలున్నాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు సహచరుడని, ఆయన ఒక మంచి నేత అని పేర్కొన్నారు. తాను రాజకీయంగా స్వయంగా ఎదిగానని రేవంత్‌రెడ్డి తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా మా మనిషే..
పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నిర్ణయం తీసుకోనంత వరకు తమ అభిప్రాయలు చెబుతామని, నియామకం జరిగిన తర్వాత.. ఎవరైనా తమ మనిషేనని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలపై సీఎం స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ హయాంలో ఐదేళ్లలో నాలుగు వాయిదాలలో కూడా రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శించారు.
రుణమాఫీ కాని రైతుల కోసం కలేక్టరేట్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని, రైతులు అక్కడి అధికారులను సంప్రదించాలని సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వాళ్లు రోడ్డెక్కే బదులు గ్రీవెన్స్ సెల్‌లో సంప్రదించాలన్నారు. తమ వద్ద ఉన్న డేటా ప్రకారం రూ.26 వేల కోట్లు రైతు రుణమాఫీకి అవసరమని, కానీ.. అందరినీ దృష్టిలో ఉంచుకుని రూ.31 వేల కోట్లకు బడ్జెట్‌లో అప్రూవల్ ఇచ్చామని తెలిపారు. తనకున్న ప్రాధాన్యం ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేశానన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రూ.20 వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేదని చెప్పారు. రైతు రుణమాఫీ చెల్లింపులతో ఇతర పథకాలకు ఎలాంటి కోత ఉండదని సీఎం స్పష్టం చేశారు.
‘‘కేసీఆర్ తనకు తోచింది చేసిండు. నచ్చిన కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చుకుంటు పోయిండు. కానీ, మేం అలా చేయడం లేదు. ప్రతి నెలా మొదటిరోజే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కోసం రూ.5 వేల కోట్లకు పైచిలుకు, లోన్ల కోసం రూ.6,500 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నాం. 2014లో ఏడాదికి రూ.6500 కోట్లు చెల్లిస్తే.. ఇప్పుడు నెలకు అంత డబ్బు కట్టాల్సి వస్తోంది’’ అని సీఎం చెప్పారు.
ఎవరికీ అన్యాయం చేయడం లేదు..
టీజీ న్యాబ్, హైడ్రా సమర్థంగా పనిచేస్తున్నాయని, హైడ్రాపై మొదట్లో కొన్ని విమర్శలు వచ్చాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.
ఏం చేసినా ఎవరో ఒకరి నుంచి వ్యతిరేకత వస్తుందని, తాను మాత్రం ఎవరికీ అన్యాయం చేయడంలేదని అన్నారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని మాత్రమే చెబుతున్నానన్నారు. ‘‘రాజకీయ పార్టీలు మీడియా సంస్థలను స్థాపించుకున్న తర్వాత వారి ఇష్టారీతిన నడుపుకోవడానికే తప్ప.. మనం చెప్పడం అనవసరం, మనం చెప్పినదానికి ఉల్టాగా చేయడానికే అవి పనిచేస్తాయి’’ అని సీఎం వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఏర్పాటు చేసే రైతు రుణమాఫీ సభకు సంబంధించి రాహుల్‌గాంధీ అపాయిట్‌మెంట్‌ను ఫోన్లలోనైనా ఓకే చేసుకోవచ్చన్నారు.
రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ పట్ల బీఆర్‌ఎస్ విమర్శలపై సీఎం స్పందిస్తూ.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిఽధిగా ఉత్తరాది వ్యక్తికి, మీడియా సలహాదారుగా ప్రభుత్వంలో మహారాష్ట్ర వ్యక్తికి పదవులు ఇచ్చిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పంటి, కంటి నొప్పికి ఢిల్లీకి వచ్చేవారని, తెలంగాణలో వైద్యులు లేరా? అని నిలదీశారు. వి.హనుమంతరావు అసలు సిసలైన కాంగ్రెస్ నేత అని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, జగన్ ప్రతిపక్ష నేతలను అణగదొక్కి.. ప్రజలిచ్చిన ఉద్యోగాలను కోల్పోయారన్నారు.
మా కుటుంబసభ్యులకు ఏ పదవీ ఇవ్వలేదు..
తమది 150 మంది తోబుట్టువులతో కూడిన పెద్ద కుటుంబం అని, అందులో సగం మందికి పైగా బంధువులు అమెరికాలో ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వంలో గానీ, కాంగ్రెస్ పార్టీలో గానీ చిన్న పదవి కూడా ఇవ్వలేదని చెప్పారు. ‘‘నా కుటుంబం అసలు తెలంగాణలో పెట్టుబడి పెట్టొద్దు అంటారు. ఆయనకు మెంటలా? 2000 సంవత్సరం తర్వాత కేటీఆర్ అమెరికా వెళ్లారు. కానీ, నా బ్రదర్స్ 1992, 93లోనే అక్కడ ఉన్నారు’’ అని అన్నారు.
తాము ఏడుగురం సొంత అన్నదమ్ములమని, తాను సీఎంను అయితే.. మిగతా వాళ్లు అన్ని దందాలు బంద్ చేసుకొని కూర్చోవాలా? అని ప్రశ్నించారు. తన సోదరుడి మిత్రుడు గడ్డితో ఇథనాల్ చేయడంలో పేటెంట్ పొందారని, ఆయన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడితే బీఆర్‌ఎ్‌సకు వచ్చే ఇబ్బందేంటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరికీ అప్పనంగా ఆస్తులు ఇవ్వడం లేదని చెప్పారు. రాజకీయాల్లో లేనప్పుడు తాను రూ.70 లక్షల ఖరీదైన ఫోన్ వాడానని, ఇప్పుడు ఆ ఫోన్ ఖరీదు రూ.కోటి ఉంటుందని అన్నారు. కేసీఆర్ సొంత విమానం కొనుక్కోవచ్చు కానీ, తాను ఖరీదైన చెప్పులు కొనుక్కోవద్దా? అని ప్రశ్నించారు.