Share News

Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. దర్యాప్తు అధికారులకు చుక్కెదురు!

ABN , Publish Date - Jun 21 , 2024 | 02:59 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ..

Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. దర్యాప్తు అధికారులకు చుక్కెదురు!

  • చార్జిషీట్‌ను తిరస్కరించిన కోర్టు

  • నిందితుల బెయిల్‌ పిటిషన్ల డిస్మిస్‌

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ.. చార్జిషీట్‌ను తిరస్కరించారు. దీంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాతో ముందుకు సాగాలని నిర్ణయించారు. చార్జిషీట్‌ తిరస్కరణకు గురవ్వడం.. తమ రిమాండ్‌ 90 రోజులు పూర్తవ్వడంతో జైలులో ఉన్న నిందితులు రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న మ్యాండేటరీ బెయిల్‌ పిటిషన్‌ వేశారు.


90 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పూర్తిచేసుకున్నామని, దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌ను దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు నిందితులు బయటకు వస్తే.. దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందంటూ గురువారం జరిగిన విచారణ సందర్భంగా పీపీ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న జడ్జి.. పీపీ వాదనలతో ఏకీభవిస్తూ.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు.


మరో రెండు వారాలే..!

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు భారత్‌ తిరిగి వచ్చేందుకు మరో రెండు వారాల సమయమే ఉంది. అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లిన ఆయన.. రెండు వారాల్లో తిరిగి రావాలి. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలమిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును విచారిస్తే ఈ కేసులో రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.


మరోవైపు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పలువురు రాజకీయ నేతలను విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులైన పోలీసుల ఆస్తులపై ఏసీబీతో విచారణ జరిపించాలంటూ డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ కూడా నిందితుల ఆస్తులపై దృష్టి సారించినట్లు సమాచారం.

Updated Date - Jun 21 , 2024 | 02:59 AM