Share News

Gurukulas: వసతి గృహ హింస..

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:16 AM

గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు.

Gurukulas: వసతి గృహ హింస..

  • అద్దె భవనాలు.. అధ్వానంగా సౌకర్యాలు

  • కలుషిత ఆహారంతో పదే పదే అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు

  • ప్రాంగణాల్లో పిచ్చి మొక్కలు.. పాము కాట్లతో పిల్లల మృతి

  • దోమల బెడదతో జ్వరాలు.. ఎలుకలు కొరికి అస్వస్థత

  • ఇరుకు గదుల్లోనే తరగతులు.. అక్కడే పడకలు కూడా

  • కార్పెట్లు, చద్దర్లూ లేవు.. మూడు జతల దుస్తులూ ఇవ్వలే

  • శాశ్వత భవనాలు నిర్మిస్తేనే సమస్యలకు పరిష్కారం

కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత.. పాము కాటుకు విద్యార్థి మృతి.. డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం! ఇటీవలి కాలంలో పెరిగిన కథనాలు ఇవి! మరీ ముఖ్యంగా గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు! ఈ నేపథ్యంలోనే, ‘ఆంధ్రజ్యోతి’ గురుకులాల విజిట్‌ చేపట్టింది! అక్కడి పరిస్థితుల్ని గమనించింది! వివరాలివీ..!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు. ఆరుబయటే భోజనం చేయాల్సిన పరిస్థితి. కొన్నిచోట్ల ఆహారం సరిగా లేకపోవడంతో విద్యార్థులు సగం కూడా తినకుండా వదిలేస్తున్నారు. గురుకులాలు మొదలై రెండు నెలలైనా కార్పెట్లు, చద్దర్లు ఇవ్వలేదు. మూడు జతల దుస్తులు ఇవ్వలేదు.


మరికొన్నిచోట్ల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో రక్షణ కరువైంది. తాగుబోతులు వచ్చి అక్కడే మందు కొడుతున్నారు. పాములు, విష పురుగులు లోపలికి వస్తున్నాయి. మరుగుదొడ్ల తలుపులు విరిగిపోయి అసౌకర్యంగా ఉంది. ఇంకొన్నిచోట్ల భవనా లు కురుస్తున్నాయి. కొన్ని గదుల్లో వర్షానికి నాని పెచ్చు లు ఊడుతున్నాయి. అత్యధిక ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయి. స్నానాల గదులకు డోర్లు కూడా లేవు. నేలపై కూర్చొనే భోజనాలు చేస్తున్నారు. ఉదాహరణకు, పాల్వంచలోని కిన్నెరసాని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో శిథిలావస్థకు చేరిన రేకుల షెడ్లలో విద్యార్థులు ఉంటున్నారు. ప్రహరీ లేకపోవడంతో మురుగునీరు ప్రవహిస్తోంది.


గుండాల ఎస్టీ గురుకులంలో మరుగుదొడ్లు, బాత్‌రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయి. విద్యార్థులు స్నానాలు చేసే వాటర్‌ ట్యాంక్‌ మురికితో పాకురు పట్టి ఉంది. ఆ నీటినే విద్యార్థులు వాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండ లం లింగంపల్లి గురుకులం విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి రెసిడెన్షియల్‌ హాస్టల్‌ ఆవరణలో అడు గు ఎత్తుకుపైగా గడ్డి ఉంది. దానిలోంచి పాములు, ఇత ర విష పురుగులు తిరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకులంలో మరుగుదొడ్లు లేవు.


విద్యార్థులు బహిర్భూమికి వెళుతూ విష పురుగుల బారిన పడుతున్నారు. ఆవరణ చుట్టూ పిచ్చి మొక్కలు భారీగా పెరగడంతో పాములు, ఇతర విష పురుగులు సంచరిస్తున్నాయి. జూలై 12న అక్షిత్‌ అనే ఏడో తరగతి విద్యార్థిని పాము కాటు వేయడంతో వారం రోజులపాటు ఆస్పత్రి పాలయ్యాడు. ఆదిలాబాద్‌ జిల్లాలోని వసతి గృహాలు, గురుకులాలు అధ్వానం గా ఉన్నాయి. దోమల బెడదతో రాత్రంతా కు నుకు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు. చర్మ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. నల్లగొండ జిల్లా నిడమనూ రు ఎస్సీ బాలికల గురుకులంలో పరిస్థితి దయనీయంగా ఉంది.


నీటి కొరత వేధిస్తోంది. స్నానాలు చేసే పరిస్థితి లేదు. డిండి గురుకులంలో 16 మంది విద్యార్థులను ఎలుకలు కరవగా, దేవరకొండ తరలించి చికిత్స చేయించారు. ఆ తర్వాత కూడా నిర్వహణ లోపాలు సరిచేయలేదు. సంస్థాన్‌ నా రాయణపురం మండలం సర్వేల్‌లో రూ.20 కోట్లతో కొత్త భవనం నిర్మించినా ప్రారంభించడం లేదు. భువనగిరి పట్టణంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. రూ.2 కోట్లతో ఆరేళ్ల క్రితం ప్రతిపాదించిన నాలుగంతస్తుల డార్మెటరీ భవన నిర్మాణ పనులు ఏడాదిన్నరగా పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి.


ఇక్కడే ఏప్రి ల్‌ 16న కలుషిత ఆహారం కారణంగా 25 మంది అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆరో తరగతి విద్యార్థి ప్రశాంత్‌ (11) చికిత్స పొందుతూ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బీసీ గురుకులంలో విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారు. బెడ్‌ షీట్స్‌, పిల్లోస్‌ అందించలేదు. రే కుల షెడ్డులో బోధన జ రుగుతోంది. డెస్క్‌ బల్లలు లేకపోవడంతో కిందే కూ ర్చుంటున్నారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ చెడిపోవడంతో బోరు నీటిని తాగుతున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉంది.


  • సోలార్‌తో నీటి సమస్యకు చెక్‌

చాలా గురుకులాల్లో వేడి నీటి సదుపాయం లేదు. దాంతో, వానాకాలం, చలికాలంలోనూ విద్యార్థులు చన్నీటి స్నానమే చేయాల్సి వస్తోంది. గురుకులాల్లో సోలార్‌ వాటర్‌ హీటర్లు ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొన్నిచోట్ల సోలార్‌ వాటర్‌ హీటర్లు ఏర్పాటు చేసినా పని చేయడం లేదు. గురుకులాల ప్రాంగణాల్లోని గడ్డి, పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తే విష పురుగుల బారి నుంచి రక్షణ పొందవచ్చు. మరికొన్ని గురుకులాల్లో ఇప్పటికీ నీటి సమస్య వేధిస్తోంది. అసంపూర్తి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభించాలని, అసలు భవనాలు లేని చోట్ల కొత్తవి నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.


  • ఒకే ప్రాంగణంలో 8 గురుకులాలు

ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురంలో ఎనిమిది (వైరా, రఘునాథపాలెం, కూసుమంచి, కుంచపర్తి, వీవీ క్రిష్టారం, బోనకల్లు బీసీ గురుకుల కాలేజీలు, ముదిగొండ ఎస్సీ బాలుర పాఠశాల, కళాశాల) గురుకులాలను ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. రఘునాథపాలెం మండల పరిధిలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల భవనంలో ఆరు గురుకులాలు నిర్వహిస్తున్నారు. ఆయా గురుకులాల్లో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.


3.jpg

ఈ ఫొటోలోని విద్యార్థి పేరు ప్రశాంత్‌. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కోలాం ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. సిక్‌ రూమ్‌లోనే ఏఎన్‌ఎం ద్వారా చికిత్సను అందిస్తున్నారు. అయినా నొప్పి తగ్గట్లేదు. అధికారులు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదని వాపోతున్నాడు. ఇక్కడే జూలై 30న ఒకేరోజు 16 మంది అస్వస్థతకు గురికావడంతోరిమ్స్‌కు తరలించి చికిత్స చేశారు.


గురుకుల రెసిడెన్షియల్‌ ఉప్పల్‌ బాలుర పాఠశాలలో న్యాణ్యత లేని భోజనం

6.jpg


5.jpg

  • చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్నాం

గత 20 రోజుల నుంచి చర్మవ్యాధులతో బాధపడుతున్నాం. వైద్య సిబ్బంది మందులిచ్చినా తగ్గడం లేదు. దాదాపు 12 మందికి చర్మవ్యాధులు సోకాయి. ప్రభుత్వ వైద్య సిబ్బంది నామ్‌కే వాస్తేగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కొంతమంది జ్వరాలు వచ్చి ఇంటికి వెళ్తున్నారు. కరెంట్‌ పోతే దోమల మోతతో ఇబ్బందులు పడుతున్నాం.

- యోగేశ్‌, 8వ తరగతి, ఝరి


ఆశ్రమ హైస్కూల్‌, ఆదిలాబాద్‌ జిల్లా

  • హాస్టల్‌ ఆవరణలో చీకటి

హాస్టల్‌ ఆవరణలో లైట్లు లేకపోవడంతో చీకటిగా ఉంటోంది. బయటకు రావడానికి భయం వేస్తోంది. కొన్ని వాష్‌రూంలకు తలుపులు లేవు. ఉన్న వాటితోనే సర్దుకుంటున్నాం. న్యాపికిన్స్‌, దుప్పట్లు ఇవ్వలేదు. దోమలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య పరీక్షలు జరపలేదు.

- శిరీష, హాస్టల్‌ విద్యార్థిని ఇల్లంతకుంట, సిరిసిల్ల జిల్లా


  • ఎప్పుడు కూలుతుందోనని భయం వేస్తోంది

బెల్లంపల్లి ఎస్సీ వసతి గృహంలోని హాస్టల్‌ భవనం స్లాబు పూర్తిగా పెచ్చులూడిపోయింది. వర్షాకాలంలో స్లాబు నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎప్పుడు కూలుతుందోననే భయంతో అందరం ఒకే గదిలో నిద్రిస్తున్నాం.

- రవి కిరణ్‌, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా


  • దోమలు కుడుతున్నాయి.. ఎలుకలు కొరుకుతున్నాయి

వసతి గృహంలో దోమలు విపరీతంగా ఉన్నాయి. నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు వచ్చి కాళ్లను కొరుకుతున్నాయి. సరిపడా బాత్‌రూంలు లేవు. దోమలు రాకుండా కిటికీలకు జాలీలను ఏర్పాటు చేయాలి. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదు. పెడుతున్న భోజనం కూడా రుచిగా ఉండటం లేదు.

- పల్లవి, 9వ తరగతి, క్రీడా పాఠశాల, ఆసిఫాబాద్‌

Updated Date - Aug 12 , 2024 | 03:16 AM