Share News

Payyavula Keshav: తిరుమల లడ్డూ వివాదం.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్..

ABN , Publish Date - Sep 25 , 2024 | 06:17 PM

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని పరీక్షల్లో నిర్ధారణ అయినా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.

Payyavula Keshav: తిరుమల లడ్డూ వివాదం.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్..
Finance Minister Payyavula Keshav

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలతో వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెయ్యి నిర్ధారణ పరీక్షల్లో లడ్డూ ప్రసాదానికి కల్తీ నేతిని వాడారని ఆధారాలతో సహా రుజువైనా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. దీనిపై ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై కూటమి శ్రేణులు, భక్తులు, ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. అపచారం చేసి అడ్డంగా దొరికిపోయినా జగన్‌లో మార్పు రావడం లేదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


భక్తులు ప్రశ్నించాలి..

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.."వైసీపీ ఎమ్మెల్యే జగన్ సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లి పూజలు చేయాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన తిరుమలకు వెళ్లి పూజలు చేస్తారంట. ఇంత అపచారం చేసినా జగన్‌లో మార్పు రాలేదు. దురాలోచనలూ మానలేదు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం ఆయనకు ఓ రాజకీయ ఆట. కానీ నాతో సహా కోట్ల మంది భక్తులకు ఇది సెంటిమెంట్. జగన్ చేసిన పాపాలు ఇక చాలు. కల్తీ నెయ్యి లడ్డూల్లో వినియోగించింది నిజం.. అపచారం జరిగిందనేది పచ్చి నిజం. జగన్ ఓ అబద్ధం.. ఆయన చేసే పూజలూ అబద్ధం. గతంలో ఉన్న లడ్డూ నాణ్యతేంటి.. ఇప్పుడున్న లడ్డూ నాణ్యతేంటని తిరుమలకు వచ్చే ఆయణ్ని భక్తులు నిలదీయాలి. అప్పుడే వాస్తవాలు నిగ్గు తేలుతాయి. ఏపీలో పాలకుడు మారడం వల్లే తిరుమలలో జరిగిన పాపాలు బయటకు వస్తున్నాయి.


అది నిజం కాదా?

తిరుమల మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశమున్నా చంద్రబాబు మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి మీద జగన్‌కు నమ్మకం లేదు. ఉందని ఆయన చెప్తున్నారు. అయితే దీనిపై ఆయన డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటుంది చాలు. కమిటీ వేయడం మాత్రమే సీఎం చేస్తాడని, టీటీడీ పాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెబుతున్నారు. అదే నిజమైతే జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ తిరుమలలో ఎందుకు అమలు చేశారు?. టెండర్లలో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సడలించాలని టీటీడీపై జగన్ ఒత్తిడి తీసుకురాలేదా? అని ప్రశ్నించారు.


ఆశపడితే అంతే..

వైసీపీ హయాంలోని ఓ బోర్డు మెంబర్ నెయ్యి వ్యవహారంపై అనుమానాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని నార్త్ ఇండియన్ మెంబర్ లేవనెత్తితే నాటి ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ భూమన అతని నోరు మూయించారు. వెంకన్న సన్నిధిలో దోపిడీ చేస్తే శిక్ష తప్పదు. స్వామివారి సొమ్మకు ఆశపడిన వారి పరిస్థితి ఏమవుతుందో అందిరికీ తెలుసు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వేంకటేశ్వరస్వామి సొమ్ము దోచుకున్న వారు.. దాన్ని అనుభవించకుండానే అనేక అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి మాకేం అవసరం. జగన్‌కు దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్లే ఇంత పెద్ద అపచారం చేశారు" అని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..

Perninani: పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా.. పేర్ని సూటి ప్రశ్న

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

Updated Date - Sep 25 , 2024 | 06:17 PM