Yanamala: రాజకీయాల్లో రాళ్లు విసిరే వారే ఎక్కువ..
ABN , Publish Date - Jul 14 , 2024 | 09:59 PM
రాజకీయాల్లో సేవకు విలువ లేకుండా పోయింది...డబ్బుల ప్రభావం పెరిగి పోతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: రాజకీయాల్లో సేవకు విలువ లేకుండా పోయింది...డబ్బుల ప్రభావం పెరిగి పోతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు ప్రభావం పెరిగితే బలహీనవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీలకు చట్టసభల్లో కచ్చితంగా రిజర్వేషన్లు ఉండాలని.. ఇది తెలుగుదేశం పార్టీ ఆశయం కూడా అని తెలిపారు.
ఈరోజు(ఆదివారం) యాదవ సంక్షేమ సంఘం సన్మాన సభ నిర్వహించారు. యనమల రామకృష్ణుడిని నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు సేవ అక్కర్లేదని.. కోట్లు ఉంటే ప్రజా ప్రతినిధులు అయిపోతున్నారని.. దీంతో ప్రజా స్వామ్యం ఖూనీ అయిపోతుందని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని మన రక్షించుకోపోతే బలహీన వర్గాలకు అవకాశం రాదని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ప్రత్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టినా...కూటమి నేతలు భారీ మెజార్టీతో గెలిచారని అన్నారు. శ్రీ కృష్ణుడుతోనే రాజకీయాలు ప్రారంభమయ్యాయనని చెప్పారు. ధర్మాన్ని శ్రీ కృష్ణుడు కాపాడమని చెప్పారని...దేవుడు చెప్పిన మాటను మనం ఆచరించాలని అన్నారు. రాజకీయ సేవలో కుల, మతాలు, ధనిక, పేద తారతమ్యాలు ఉండకూడదని చెప్పారు. విశాఖను ఆర్ధిక రాజధానిని చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు.
తనకు రాజకీయాలు మీద ఆసక్తి లేదని....కూతురు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ అయ్యారని గుర్తుచేశారు. పల్లా శ్రీనివాసరావు తండ్రికి దగ్గ తనయుడు..అందుకే ఆయనకు రాష్ట్ర అధ్యక్షత పదవి వరించిందని తెలిపారు. భారత దేశ చరిత్ర లోనే పల్లా శ్రీనివాసరావు మెజార్టీ సాధించారని ప్రశంసించారు. విశాఖలో ఇద్దరు యాదవ సామాజిక వర్గం నేతలను అసెంబ్లీకి పంపారని.. పల్లా, వంశీ మీద చాలా బాధ్యత ఉందని వివరించారు.
వంశీ కృష్ణ మంచి పోరాట యోధుడు..వంశీని టీడీపీలోకి తీసుకుందామని ఫోన్ చేశానని.. తన నంబర్ లేదు ఏమో వంశీ ఫోన్ ఎత్త లేదని చెప్పారు. ఆ తర్వాత ఆయన దగ్గరకు తన అనుచరులను పంపానని తెలిపారు. రాజకీయాల్లో అభినందించిన వారుకంటే..రాళ్లే విసిరే వారు ఎక్కువని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఆశయాలు ఒక్కటేనని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.