Share News

CM Revanth Reddy: బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 08:51 PM

CM Revanth Reddy: గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే.. ఏటా ఆయనను స్మరించుకోవడమేనని చెప్పారు. గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు.

CM Revanth Reddy: బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy

హైదరాబాద్: గద్దర్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ(శుక్రవారం) రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గద్దర్ తనను ఎప్పుడూ ప్రోత్సహించేవారని చెప్పారు. సమాజమే తన కుటుంబంగా భావించారని.. ఒంటరి అనే భావన తనకు వచ్చినప్పుడల్లా.. గద్దర్‌ దగ్గరకు వెళ్లేవాడిననని గుర్తుచేసుకున్నారు. ‘నీ బాధ్యత నెరవేర్చు.. ప్రజలకు నీకు అవకాశం ఇస్తారు’ అని గద్దర్ అనేవారని చెప్పారు. కుటుంబం కంటే సమాజ శ్రేయస్సుకే గద్దర్ నిత్యం కృషిచేసేవారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.


గద్దర్‌ చెప్పినట్లే తన బాధ్యత నెరవేర్చాను.. ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పారు. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా గద్దర్‌ అవార్డు ఉండాలని భావించామన్నారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే.. ఏటా ఆయనను స్మరించుకోవడమేనని చెప్పారు. గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు. గద్దర్‌ మృతదేహాన్ని తీసుకెళ్తే.. గత కేసీఆర్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియానికి తాళం వేసిందని మండిపడ్డారు. గద్దరన్న చివరిచూపు ప్రజలందరికీ దక్కాలని ఎల్బీ స్టేడియానికి తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని అన్నారు. పద్మ అవార్డులు ఇవ్వాలని ఐదుగురి పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని గుర్తుచేశారు. గద్దర్‌, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్‌ తిరుమలరావు పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదించామని చెప్పారు. పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చారని.. వాళ్లకంటే తాము ప్రతిపాదించినవాళ్లు తక్కువా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. గద్దరన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ ఆఫీస్‌ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. గద్దర్‌ను అవమానిస్తే తగిన శాస్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.


ఉగాది సందర్భంగా గద్దర్‌ అవార్డులు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Bhatti.jpg

తెలుగు సినీ రంగానికి.. గద్దర్ పేరుతో తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉగాది సందర్భంగా గద్దర్‌ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. గద్దర్‌కు కులం, మతం లేదు.. ఆయన విశ్వ మానవుడని అభివర్ణించారు. గద్దర్ తెలంగాణలో పుట్టడం మన అదృష్టమని ఉద్ఘాటించారు. గద్దర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా చేస్తారని ఎవరూ ఊహించి ఉండరని చెప్పారు. గద్దర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని అన్నారు. పాట, మాటతో లక్షలాదిమందిని ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం గద్దర్ ప్రత్యేక పాట రాశారని గుర్తుచేశారు. గద్దర్ పాట తెలంగాణ ప్రజలను కదిలించిందని చెప్పారు. ఐదుగురికి పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన చేశామని చెప్పారు. గద్దర్‌, గోరటి వెంకన్న తదితరులకు ఇవ్వాలని లేఖ రాశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 09:00 PM