AP Elections: ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!
ABN , Publish Date - Mar 28 , 2024 | 08:07 AM
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తి ప్రసంగం విన్న తర్వాత ఎన్నికల వేళ మరికొన్ని అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని జగన్ (Jagan) ప్రయత్నిస్తున్నారా..? అనే అనుమానాలు జనాల్లో వస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత ఎన్నికల వేళ.. బాబాయి వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ స్పందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకా హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయించాల్సిన జగన్ ఆ ప్రయత్నం చేయకపోగా.. కేసు దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేశారు. దీంతో వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించి సీబీఐ(CBI) దర్యా్ప్తును కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమార్తె పోరాటం ఫలించి ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించారు. అయినా.. కేంద్ర సంస్థ దర్యాప్తును స్వేచ్ఛగా సాగనీయకుండా.. అనేక అడ్డంకులు సృష్టించింది ఎవరనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూసింది. నిందితులుగా భావిస్తున్న వ్యక్తులను ఈ ప్రభుత్వం ఎలా కాపాడుతూ వచ్చిందో ఏపీ ఓటర్లంతా చూశారు. ఇవ్వన్నీ చూసిన ప్రజలకు.. నిన్న ప్రొద్దుటూరు సభలో జగన్ ప్రసంగం విన్న తర్వాత ఆశ్చర్యపోయారట.
AP Politics: నరకాసుర పాలనకు చెక్ పెట్టే సమయం వచ్చింది.. జగన్‌పై చంద్రబాబు ఫైర్
గొడ్డలిపోటును గుండెపోటుగా..!
వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ లీకులు ఇచ్చిన వ్యక్తులు ప్రస్తుతం వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నారన్న విషయం జగమెరిగిన సత్యమే. ఆ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న ఓ వ్యక్తికి జగన్.. ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఈ హత్య కేసులో జగన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ప్రచారం దేశ వ్యాప్తంగా సాగింది. మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంపై అసత్య ఆరోపణలు చేస్తూ.. దర్యాప్తు సక్రమంగా జరగకుండా అడ్డుపడింది ఎవరనేది ఏపీ ప్రజలు చూసిన వాస్తవం.. ఇవ్వన్నీ మర్చిపోయిన జగన్.. తన బాబాయిని ఎవరో చంపారని.. హంతకులు తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడం హాస్యాస్పద మంటున్నారు ఏపీ ప్రజలు. హంతకులను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి బదులు జగన్ హంతకులు ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారా..? అనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయట. మొత్తానికి ఎన్నికల వేళ మరోసారి బాబాయి హత్యను తెరపైకి తెచ్చి.. ప్రజలను మభ్యపెట్టడం ద్వారా ఓట్లతో లబ్ధిపొందేందుకు జగన్ పెద్ద ప్లానే వేసినట్లు ఆయన ప్రసంగాన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఎవరిది రాజకీయ స్వార్థం..
రాజకీయ స్వార్థం కోసం తన వాళ్లు ఒకరిద్దరు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారంటూ వివేకా కుమార్తె సునీత, వైఎస్ షర్మిళను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపైనా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన అన్ననే మోసం చేసి.. కేసును పక్కదారి పట్టించాలని చూస్తుంటే.. తండ్రి కేసులో హంతకులు ఎవరో తేలాలని సునీత న్యాయపోరాటానికి దిగారు. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాంటి సునీతనే ప్రధాన నిందితురాలు అనే విధంగా జగన్ నిన్నటి సభలో వ్యాఖ్యానించారు. అంటే తనకు ఏ పాపం తెలియదని చెప్పే ప్రయత్నం జగన్ చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయినే హత్య చేయించారనే ఆరోపణలు జగన్‌పై ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హత్యలో భాగస్వాములకు పదవులు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లపై జగన్ ఆరోపణలు చేయడం చూసి ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు సభ సాక్షిగా జగన్ అబద్ధాలు చెబుతూ దొరికిపోయారంటున్నారు ఏపీ ఓటర్లు.
నొక్కింది ఎంత.. బొక్కింది ఎంత!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..